జైపూర్ : బీజేపీ పాలిత రాజస్థాన్లోని అల్వార్లో దారుణం చోటుచేసుకున్నది. మహిళను అపహరించి, కదులుతున్న కారులో సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఏప్రిల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 24న రాత్రి కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి బయటకు వచ్చిన ఆమెను ముగ్గురు వ్యక్తులు బొలేరో వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు. ఒక చోట మరో నలుగురు వాహనంలోకి ఎక్కారు. నడుస్తున్న వాహనంలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించడానికి ప్రయత్నించిన ఆమె నోట్లో గుడ్డలు కుక్కారు.
ఒక ఇంట్లో తనను 11 రోజులు బంధించి ఉంచారని, అశ్లీల వీడియోలను చిత్రీకరించారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని బయటకు చెబితే వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారని పేర్కొన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న తనను రోడ్డు పక్కన పడేసి పారిపోయారని తెలిపారు. స్థానికుల సాయంతో తాను ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు విషయం చెప్పానని ఆమె తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదుచేయలేదని, కోర్టును ఆశ్రయించడంతో ఎట్టకేలకు నమోదుచేసినట్టు చెప్పారు.