Death : స్నానం కోసం ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ (Electric water heater) తో నీళ్లు వేడి చేసుకుంటుండగా విద్యుత్ షాక్ (Current shock) తగిలి ఓ 23 ఏళ్ల యువతి దుర్మరణం పాలయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని మహిపాల్పూర్ (Mahipalpur) లో ఈ ఘటన చోటుచేసుకుంది. చేతికి హీటర్ తగలడంతో ఆమె బాత్రూమ్లోనే ప్రాణాలు కోల్పోయింది.
బాత్రూమ్లోకి వెళ్లిన యువతి ఎంతకూ బయటికి రాకపోవడంతో ఆమె స్నేహితురాలు తలుపులు నెట్టి చూసింది. లోపలి నుంచి గడియ వేసి ఉండటం, ఎంత పిలిచినా పలుకకపోవడంతో అనుమానించిన ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి తలుపు బద్దలు కొట్టి చూడగా.. చేతిలో హీటర్ పట్టుకుని విగతజీవిగా పడి ఉంది.
మృతురాలు మణిపూర్‌కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ షాక్‌తోనే యువతి చనిపోయినట్లు తాము ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపారు. ఇందులో కుట్ర కోణం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు.