సీజేఐకి సాక్షి లేఖ
అహ్మదాబాద్, సెప్టెంబర్ 20: బిల్కిస్ బానో కేసులో గత నెలలో విడుదలైన కీలక వ్యక్తి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని, అతడి నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని ఈ కేసులోని సాక్షి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్పై సామూహిక లైంగికదాడికి పాల్పడిన 11 మంది జీవితఖైదులను గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం పంద్రాగస్టు సందర్భంగా విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఆ 11 మందిలో ఒకరు తనను బెదిరిస్తున్నట్టు ఈ కేసులో సాక్షి ఇంతియాజ్ ఘాంచి సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఉంటున్న దేవగఢ్ బరియా నుంచి స్వస్థలమైన సింగ్వాడ్కు ఈ నెల 15వ తేదీన వెళ్తున్న సమయంలో ఈ కేసులో దోషి రాధేశ్యామ్ షా పిప్లాడ్ రైల్వే బారికేడ్ వద్ద చూసి తనను బెదిరించాడని ఆరోపించారు. ‘నన్ను దోషిగా చూపించి ఏం సాధించావ్? ఇప్పుడు నేను బయట ఉన్నాను’ అని అన్నాడని తెలిపారు. వాహనంలో వెళ్లే ముందు షాతోపాటు అతడి డ్రైవర్ తనను చూసి నవ్వారని పేర్కొన్నారు. లేఖ కాపీలను గుజరాత్ హోంశాఖ కార్యదర్శికి, జాతీయ మానవ హక్కుల కమిషన్కు పంపారు.