మోతిహరి, మే 21: మాజీ ప్రధాని నెహ్రూతో సహా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అణగారిన కులాలకు రిజర్వేషన్లను వ్యతిరేకించారని ప్రధాని మోదీ ఆరోపించారు. బీఆర్ అంబేద్కర్ లేకుంటే.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లను నెహ్రూ అంగీకరించే వారు కాదని అన్నారు. రిజర్వేషన్ల అంశంపై నెహ్రూ ఆనాడు దేశంలోని రాష్ర్టాల సీఎంలకు రాసిన లేఖల్లో తన అభిప్రాయాలు స్పష్టంగా వ్యక్తం చేశారని మోదీ పేర్కొన్నారు. బీహార్‌లోని పుర్బి చంపారన్ లోక్‌సభ నియోజకవర్గంలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
నెహ్రూ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానులుగా చేసిన వాళ్లు, ఇందిరా గాంధీ లేదా రాజీవ్ గాంధీ.. ఎవరైనా రిజర్వేషన్లను వ్యతిరేకించిన వారేనని, అది ఆ పార్టీ లక్షణమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కాంగ్రెస్ తగిన గౌరవం ఇవ్వలేదని మోదీ ఆరోపించారు. బీజేపీ అధిక మెజార్టీతో మూడోసారి అధికారంలోకి వస్తే, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు.