ఇంఫాల్, నవంబర్ 17 : ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతున్నది. జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరగా అట్టుడుకుతున్నది. అయినప్పటికీ ప్రధాని నరేంద్రమోదీ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హింసాత్మక ఘటనలతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉంటే.. ప్రధాని మాత్రం విదేశీ పర్యటనల్లో ఉన్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో కనీసం ఒక్కసారి కూడా ప్రధాని పర్యటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మణిపూర్‌పై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఇది తేటతెల్లం చేస్తున్నదని ఆరోపిస్తున్నాయి.
మిలిటెంట్లు బందీలుగా పట్టుకుపోయిన ఆరుగురు మైతీలు మృతదేహాలుగా నదిలో తేలడంతో మణిపూర్‌లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆగ్రహంతో ఉన్న బాధితులు శనివారం మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు, ఆస్తులపై దాడి చేశాయి. ఒక మూక తీవ్ర ఆగ్రహంతో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, మంత్రులు సపం రంజన్, ఎల్ సుసీంద్రో సింగ్, వై కఖేంచంద్లతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సపమ్ కుంజాకెసోర్, జోయ్‌కిషన్ సింగ్, మరికొందరి ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేశారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఇంఫాల్‌లో నిరవధిక కర్ఫ్యూను విధించింది. ఏడు జిల్లాల్లో మొబైల్ సర్వీస్‌లు, ఇంటర్నెట్ను నిలిపివేసింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. టీ రబీంద్రో, టీహెచ్ రాధేశ్యామ్, పావోనమ్ బ్రాజెన్లు రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతున్నది. అలాగే తనతో పాటు మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే కీషామ్ మేఘచంద్ర ఆదివారం తెలిపారు.
ఆరుగురిని హతమార్చిన నిందితులను 24 గంటల్లో పట్టుకోవాలని ఆందోళనకారులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకు నిరసనను విరమించబోమని స్పష్టం చేశారు. మిలిటెంట్లపై తక్షణం మిలటరీ చర్య చేపట్టాలని కో-ఆర్డినేటింగ్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ (సీఓసీఓఎంఐ) డిమాండ్ చేసింది. అలాగే బాధిత ప్రాంతాల్లో భద్రతా, ప్రత్యేక బలగాలను ఉపసంహరించాలని కోరింది. కాగా, కేంద్రం ప్రకటించిన ఆరు కల్లోలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న ఆర్మ్డ్ స్పెషల్ ఫోర్సెస్ చట్టాన్ని ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా విజ్ఞప్తి చేసింది. కాగా, మణిపూర్‌లో హింసపై కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీలో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలో నిర్వహించాల్సిన సభలను ఆయన రద్దు చేసుకున్నారు.
ఉద్దేశపూర్వకంగానే అధికార బీజేపీ మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులకు ఆజ్యం పోస్తున్నదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ‘గత ఏడాది మే నుంచి మణిపూర్ రాష్ట్రం ఊహించని బాధను అనుభవిస్తున్నది. రాష్ట్రంలోని పరిస్థితులకు పూర్తి బాధ్యత వహించి చక్కదిద్దాల్సిన ప్రభుత్వం విద్వేష, విభజన రాజకీయాలతో ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలో హింసను రావణకాష్టంలా రగిలిస్తున్నది’ అని ఎక్స్‌లో విమర్శించారు. నవంబర్ 7 నుంచి అక్కడ 17 మంది మరణించారని, ఇప్పుడు హింస కొన్ని కొత్త జిల్లాలకు కూడా వ్యాపించిందని, తర్వాత అది మిగిలిన ఈశాన్య రాష్ర్టాలకు కూడా పాకే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) ఆదివారం బీజేపీ నేతృత్వంలోని బీరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ఎన్డీఏ కూటమి బలం అసెంబ్లీలో 53 నుంచి 46కు పడిపోయింది. 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం విపక్షాలకు ఏడు సీట్లు మాత్రమే ఉన్నాయి. అందులో కాంగ్రెస్‌కు 5, కుకీ పీపుల్స్ అలయెన్స్‌కు 2 ఉన్నాయి. బీజేపీకి ప్రస్తుతం 37 స్థానాలు ఉండగా, అందులో 19 మంది సభ్యులు పార్టీ అసమ్మతివాదులుగా ఉన్నారు. వారు బీరేన్ సింగ్‌ను నిశితంగా విమర్శిస్తున్నారు. బీరేన్ సింగ్ కు గరిష్ఠంగా 20 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉందని, ఆయన పదవికి ప్రమాదం పొంచి ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.