లక్నో, అక్టోబర్ 11: సోషలిస్టు నాయకుడు జయప్రకాశ్ నారాయణ్‌కు నివాళి అర్పించకుండా అడ్డుకున్న బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌కు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా లక్నోలోని జయప్రకాశ్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్(జేపీఎన్ఐసీ)లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించాలని సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయించింది. దీనికి పోలీసులు అనుమతించలేదు. అఖిలేశ్ ఇంటికి పెద్ద ఎత్తున ఎస్పీ కార్యకర్తలు చేరుకొని బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. చివరకు ఒక వాహనంలో ఏర్పాటు చేసిన జయప్రకాశ్ నారాయణ్ విగ్రహానికి అఖిలేశ్ యాదవ్ నివాళులు అర్పించారు.
జయప్రకాశ్ నారాయణ్ ప్రారంభించిన సోషలిస్టు, ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం నుంచి రాజకీయంగా ఎదిగిన నితీశ్ కుమార్‌ను ఉద్దేశించి అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బీహార్ ముఖ్యమంత్రి ప్రతిసారి జయప్రకాశ్ నారాయణ్ గురించి మాట్లాడుతుంటారు. జేపీ ఉద్యమం నుంచే ఆయన కూడా రాజకీయంగా ఎదిగారు. జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా సమాజ్‌వాదీలను నివాళి అర్పించకుండా అడ్డుకున్న ప్రభుత్వానికి నితీశ్ మద్దతు ఉపసంహరించుకోవాలి’ అని అఖిలేశ్ పిలుపునిచ్చారు. అఖిలేశ్ వ్యాఖ్యలకు జేడీయూ నేత కేసీ త్యాగి కౌంటర్ ఇచ్చారు. జయప్రకాశ్ నారాయణ్ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించారని, ఆ ఎమర్జెన్సీని విధించిన కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ ముందు మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.