Amith Shah : భారత్ నుంచి మలేరియాను త్వరలోనే పూర్తిగా తొలగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి (Union Home Minister) అమిత్ షా ప్రకటించారు. నేడు అహ్మదాబాద్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిర్వహించిన ఆలిండియా మెడికల్ కాన్ఫరెన్స్ (IMA NATCON 2025) లో ఆయన ప్రసంగించారు. భారత్లో మలేరియా కేసులు 97 శాతం తగ్గాయని, అతి త్వరలో దేశం నుంచి పూర్తిగా మలేరియాను తరిమేస్తామని అన్నారు.
ఆయుష్మాన్ భారత్, మిషన్ ఇంద్రధనుష్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన చెప్పారు. వికసిత్ భారత్–2047 లక్ష్యాన్ని సాధించాలంటే ఆరోగ్యవంతమైన ప్రజలు అవసరమని, అందుకు డాక్టర్లు.. ప్రభుత్వ పథకాల లక్ష్యం నెరవేరేలా కలిసి పనిచేయాలని కోరారు. భారత్ ఆరోగ్య రంగంలో తీసుకుంటున్న చర్యలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.
దేశంలో గడిచిన ఐదేళ్లలోనే డెంగ్యూ మరణాల రేటును 1 శాతం, ప్రసూతి మరణాల సంఖ్య 25 శాతం తగ్గిందని షా వెల్లడించారు. 2014లో రూ.37 వేల కోట్లుగా ఉన్న కేంద్ర ఆరోగ్య బడ్జెట్ ఇప్పుడు రూ.1.28 లక్షల కోట్లకు పెరగడమే ఈ విజయాలకు కారణమని పేర్కొన్నారు.