Donald Trump | భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కొంత తేలికపడింది. కాల్పుల విరమణకు (ceasefire) పాకిస్థాన్ ప్రతిపాదించగా అందుకు భారత్ అంగీకరించింది. పూర్తిస్థాయిలో, తక్షణ కాల్పుల విరమణకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా స్పందించారు. కశ్మీర్ సమస్య (Kashmir issue) కోసం ఇరు దేశాలతో కలిసి కృషి చేస్తానని వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితులను ఇరుదేశాలు అర్థం చేసుకున్నాయని చెప్పారు. దాడులు ఆపాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించాయన్నారు. దాడులు పౌరుల మరణాలు, వినాశనానికి దారి తీస్తాయన్నారు. రెండు దేశాల మధ్య చరిత్రాత్మక కాల్పుల విరమణ నిర్ణయంలో అమెరికా సహాయపడినందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోనున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. అంతేకాదు, కశ్మీర్ విషయలో పరిష్కారం కోసం రెండు దేశాలతో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
కాగా, రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఒప్పందం అనంతరం ఆయన శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ‘పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు భారత డీజీఎంవోకు ఫోన్ చేశారు. కాల్పుల విరమణకు ప్రతిపాదించారు. అనంతరం భూతల, గగనతల, సముద్రతలాల్లో కాల్పుల విరమణకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. సాయంత్రం 5 గంటల నుంచే తక్షణం, పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది’ అని ప్రకటించారు. ఒప్పందం అమలుపై ఇరువైపులా సైన్యానికి తగిన ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. తదుపరి కార్యాచరణ కోసం రెండు దేశాల డీజీఎంవోలు ఈ నెల 12న మరోసారి సమావేశం కానున్నట్టు తెలిపారు. మరోవైపు సాయంత్రం 4:30 గంటల నుంచి తమ దేశంలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు.
Also Read..
Motu | మోటూ అని పిలిచాడని.. ఇద్దరిని కాల్చేశాడు
IND-PAK Ceasefire | వెనక్కి తగ్గిన పాక్ సైన్యం.. జమ్మూకశ్మీర్, పంజాబ్లో సాధారణ పరిస్థితులు..!
Weather Update | ఇదేం వాతావరణం బాబోయ్..! ఓ వైపు భానుడి భగభగలు.. మరో వైపు వరుణుడి ప్రతాపం..!