గోరఖ్‌పూర్: మోటూ (Motu) అన్నందుకు ఇద్దరిని కాల్చాడో వ్యక్తి. ఉత్తరప్రదేశ్‌లోని ఖజ్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గత గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెల్గాట్ ప్రాంతానికి చెందిన అర్జున్ చౌహాన్.. ఓ ఆలయంలో జరిగిన వేడుకకు హాజరయ్యాడు. అదే ఉత్సవానికి మంజారియాకు చెందిన అనిల్ చౌహాన్, శుభమ్ చౌహాన్ కూడా అతిథులగా వచ్చారు. ఈ సందర్భంగా అర్జున్ను మోటూ అని పిలిచారు. తన ఆకృతిని తక్కువగా చేసి మాట్లాడారని వారిపై అర్జున్ కోపం పెంచుకున్నాడు.
మరుసటి రోజూ అతిథులిద్దరు కారులో తమ స్వస్థలానికి బయల్దేరారు. ఈ క్రమం అర్జున్ తన స్నేహితుడైన ఆసిఫ్ ఖాన్‌తో కలిసి వారిని వెంబడించాడు. టెనువా టోల్ ప్లాజా వద్ద వారి కారును అడ్డుకున్న అర్జున్.. అనిల్, శుభమ్‌తో తగాదా పెట్టుకున్నాడు. ఈక్రమంలో సహనం కోల్పోయిన అర్జున్.. వారిద్దరిపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై శుభమ్ చౌహాన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేశారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరు క్షేమంగానే ఉన్నారని చెప్పారు.