Weather Update | దేశవ్యాప్తంగా వింత వాతావరణం ఏర్పడుతున్నది. పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య, పశ్చిమ భారతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. అదే సమయంలో ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వాయువ్య భారతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రాబోయే మూడు నుంచి ఐదురోజులు 4 నుంచి 6 డిగ్రీల వరకు పెరగవచ్చని పేర్కొంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఒడిశా మరియు జార్ఖండ్‌లలో ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీల వరకు పెరుగుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో పలుచోట్ల వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆదివారం నుంచి గురువారం వరకు పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో వేడిగాలులుంటాయని పేర్కొంది. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని తెలిపింది. ఉత్తర పాకిస్తాన్ సమీపంలో తుఫాను చురుగ్గా ఉందని.. దాంతో పాటు ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది.
దాంతో ఆది, సోమవారాల్లో జమ్మూ కశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోనూ పలుచోట్ల వానలు కురుస్తాయని అంచనా వేసింది. రాబోయే ఐదు రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, మణిపూర్, త్రిపురలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. దాంతో వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో దక్షిణ భారతంలోనూ రాబోయే రెండురోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడులోని తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడేందుకు అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. హిమాచల్‌లో వర్షం, హిమపాతం కారణంగా చలి పెరిగింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే కేరళను తాకుతాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది.