హైదరాబాద్, ఆగస్టు 13 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అటవీ భూమిలో నిర్మాణాలు, బాధిత వ్యక్తికి పరిహారం చెల్లింపులో అలసత్వం వహించడంపై మహారాష్ట్రలోని షిండే సర్కారుపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘లాడ్లీ బెహనా’, ‘లడ్కా భౌ’ వంటి ఉచిత పథకాల కోసం ప్రభుత్వం దగ్గర నిధులు ఉంటాయిగానీ, బాధితులకు పరిహారం చెల్లించడానికి మాత్రం పైసలు ఉండవా? అంటూ
సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే, ఉచిత పథకాలను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
పూర్వీకుల నుంచి వచ్చిన 24 ఎకరాల భూమిని 1963లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్నదని, అయితే, దానికి తగిన పరిహారం ఇంకా ఇవ్వలేదని ప్రైవేటు వ్యక్తులు కోర్టులో పిటిషన్ వేశారు. పరిహారం గురించి ఏండ్లుగా అడిగితే, 2004లో మరోచోట కొంత భూమి ఇచ్చారని, అయితే, అది అటవీ భూమి అని కేంద్ర సాధికార కమిటీ తమను బయటకు పంపించివేసిందని పిటిషన్లో ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు..
1963లో సేకరించిన భూమిలో రక్షణశాఖ నిర్మాణాలు చేపట్టడంపై, బాధితులకు పరిహారాన్ని చెల్లించకపోవడంపై ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. బాధితుడికి ఎంత పరిహారం ఇవ్వనున్నారో పూర్తి నివేదికతో రావాలని ఈనెల 7న ఆదేశించింది. అయినప్పటికీ, ప్రభుత్వం ఆ వివరాలను మంగళవారం కోర్టుకు సమర్పించలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది.