ముంబై: మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ (Nawab Malik) కీలక ప్రకటన చేశారు. తన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫొటో వినియోగించబోనని తెలిపారు. సీఎం షిండే నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్, ముంబైలోని మన్‌ఖుర్ద్ - శివాజీ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు అబూ అసిమ్ అజ్మీతో ఆయన తలపడుతున్నారు.
కాగా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ గురువారం మాలిక్ కోసం ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన ‘బాటేంగే టు కటేంగే’ పిలుపును అజిత్ పవార్ వ్యతిరేకించారు. రాష్ట్రం ఎల్లప్పుడూ మత సామరస్యాన్ని కొనసాగిస్తుందని అన్నారు.
మరోవైపు ఎన్సీపీ అభ్యర్థి నవాబ్ మాలిక్‌కు అండర్ వరల్డ్ కింగ్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆయనకు తమ పార్టీ మద్దతు ఇవ్వదని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర బీజేపీ నేతలు స్పష్టం చేశారు.