Bihar Elections | బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections) జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల వేళ అధికార ఎన్డీయే కూటమిలో విభేదాలు నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సీట్ల పంపకాల విషయంలో అధికార ఎన్డీయేలో ముసలం ప్రారంభమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
దీనిపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తాజాగా స్పందించారు. బీహార్ ఎన్డీయే కూటమిలోని పార్టీల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు. మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలన్నీ తప్పుడు కథనాలు అంటూ కొట్టిపారేశారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) నాయకత్వంలో కూటమి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
అలాగే బీహార్ సీఎం అభ్యర్థిపై (Bihar Chief Minister) కూడా షా క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల తర్వాతే బీజేపీ, దాని మిత్రపక్షాలు ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తాయని తెలిపారు. ‘నితీశ్ కుమార్ సీఎం అవుతారా..? లేదా..? అని నిర్ణయించేది నేను కాదు. ప్రస్తుతానికి నితీశ్ నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము. ఎన్నికల తర్వాత అన్ని మిత్రపక్షపార్టీలు కలిసి కూర్చొని తమ నాయకుడిని నిర్ణయిస్తాయి’ అని అమిత్ షా స్పష్టం చేశారు.
‘2020 ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీ అత్యధిక స్థానాల్లో నెగ్గింది. ఆ సమయంలో నితీశ్ కుమార్ ప్రధాని మోదీని కలిసి బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉండటం మంచిదని తన అభిప్రాయం చెప్పారు. కానీ, మా మిత్రపక్షానికి మేం ఎప్పుడూ గౌరవం ఇస్తాం. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని ఆయన్ని సీఎం చేశాం’ అని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి దశ నవంబర్ 6, రెండో దశ నవంబర్ 11 తేదీల్లో జరగనున్నాయి. అదేనెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాల్లో ఎన్డీయే గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందని ఈ సందర్భంగా షా ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read..
Bomb Threat | ఉప రాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపులు