IAF Chief AP Singh : శత్రు దేశం పాకిస్తాన్ ను మోకాళ్లపై కూర్చోబెట్టే సత్తా మనకుందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. పాకిస్తాన్లోని అనేక ప్రదేశాలపై ఒకేసారి కొన్ని గంటల్లో దాడి చేసి ధ్వంసం చేయగలమని ఆయన అన్నారు. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారత సైనిక సత్తా గురించి చెప్పారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సామర్ధ్యం గురించి వివరించారు. ‘‘భారత్ బలమైన దేశంగా ఎదగాలంటే సైన్యాన్ని బలోపేతం చేయడానికి ప్రాధాన్యమివ్వాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని అంశాల్లో బలంగా మారుతోంది. ఒకేసారి అనేక ఆపరేషన్స్ నిర్వహించగల సత్తా మన సొంతం. యుద్ధ రంగంలోని ప్రజల్ని రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఉగ్రవాదుల్ని నిర్మూలించడం, వారి స్థావరాల్ని ధ్వంసం చేయడం, ఒకేసారి వేర్వేరు చోట్ల దాడులు చేయడం వంటి పనుల్ని చేయగలదు. ఈ అంశాల్లో ఇప్పటికే అనేక పరీక్షల్ని విజయవంతంగా పూర్తి చేశాం.
ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు కూడా సైనికంగా బలహీనంగా ఉంటే ఆక్రమణకు గురైన విషయం చరిత్ర చెబుతుంది. అందుకే ప్రతి దేశానికి బలమైన సైనిక శక్తి అవసరం. ఆర్థికంగా ఎదిగినంత మాత్రాన ఒక దేశం తన సమగ్రతను కాపాడుకోలేదు’’ అని ఏపీ సింగ్ వ్యాఖ్యానించారు.