బెంగళూరు, డిసెంబర్ 2: నేనే అసలైన రాధను, కృష్ణే నా భర్తే.. అంటూ కర్ణాటకలో నలుగురు మహిళలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు అసలైన రాధ ఎవరో కనిపెట్టే పనిలో పోలీసులు పడ్డారు. ఇదంతా 12 ఎకరాల భూమి కోసం జరుగుతున్న పోరాటంగా వారు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే… బెంగళూరుకు సమీపంలోని బండపుర గ్రామంలో కృష్ణ అనే వ్యక్తికి 12 ఎకరాల భూమి ఉంది. 1986లో కృష్ణ మరణించారు. అయితే ఆయన భార్య రాధను తానేనంటూ నలుగురు మహిళలు న్యాయపోరాటానికి దిగారు. అందులో ముగ్గురు వ్యక్తిగతంగా హాజరు కాగా, మరో మహిళ న్యాయవాది ద్వారా కేసు దాఖలు చేసింది.
కృష్ణునికి తానే అధికారిక భార్యనంటూ నలుగురు కూడా కొన్ని పత్రాలను సమర్పించారు. అయితే అందులో కొన్ని నకిలీవి, ఫోర్జరీ డాక్యుమెంట్లను తెలుసుకున్న అధికారులు అందులో అసలైనవేవో నిర్ధారించే పనిలో పడ్డారు. కృష్ణ చట్టబద్ధమైన భార్య, వారసులకు మాత్రమే ఆ భూమి చెందాలని, ఈ క్రమంలో కృష్ణ అసలైన వారసులు ఎవరో తేల్చిచెప్పే పత్రాలు, బంధుత్వాల గురించి పరిశోధించి నివేదిక ఇవ్వాలని పోలీసులను కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. యజమాని కృష్ణ మరణించి సుమారు 40 ఏండ్లు పూర్తి కావడంతో వారసత్వ పోరాటాలు ఎంత క్లిష్టంగా, నాటకీయంగా ఉంటాయో ఈ కేసు రుజువు చేస్తున్నది.