న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం కోసం సుస్మిత దేవ్ (35) అనే వివాహిత తన భర్త కరణ్ దేవ్ (36)ను దారుణంగా చంపేసింది. న్యూఢిల్లీలోని ద్వారక డీసీపీ అంకిత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, అచేతన స్థితిలో ఉన్న కరణ్‌ను ఈ నెల 13న ఉత్తమ్ నగర్‌లోని మాతా రూప్రాణి మగ్గో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆయన మరణానికి కారణం విద్యుదాఘాతమని వైద్యులు గుర్తించి, ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. మొదట్లో కరణ్ మరణంపై అతడి కుటుంబ సభ్యులకు ఎటువంటి అనుమానం రాలేదు.
మృతదేహానికి పోస్ట్‌మార్టం పరీక్ష చేయవద్దని కూడా కోరారు. కానీ కరణ్ భార్య సుస్మిత, ఆయన బాబాయ్ కుమారుడు రాహుల్ దేవ్ (24) మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను కరణ్ తమ్ముడు కుణాల్ పరిశీలించడంతో అనుమానం మొదలైంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్లో కరణ్ దేవ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిగింది. కరణ్ విద్యుదాఘాతం వల్ల మరణించినట్లు నివేదిక పేర్కొంది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సుస్మిత, రాహుల్ ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు.