ప్రయాగ్‌రాజ్, జనవరి 24: భార్య కారణంగా భర్త సంపాదించలేని అశక్తతకు గురైన పక్షంలో భర్త నుంచి భరణం కోరే అర్హత భార్యకు ఉండదని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. బావమరిది, మామ జరిపిన కాల్పుల్లో గాయపడిన ఓ హోమియాపతి డాక్టర్ నుంచి భరణం కోరుతూ ఆయన భార్య దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ని హైకోర్టు కొట్టివేస్తూ కుశీనగర్లోని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్ట్ సమర్థించింది. భార్య తరఫు బంధువులు పాల్పడిన క్రిమినల్ చర్యల కారణంగా సంపాదించలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిన భర్త నుంచి భరణం కోరుతున్న భార్య చర్యను తప్పుపట్టిన జస్టిస్ లక్ష్మీకాంత్ శుక్లా తాము ఆ భర్తకు అన్యాయం చేయలేమని అన్నారు.
తన క్లినిక్‌లో జరిగిన గొడవ సందర్భంగా హోమియోపతి డాక్టర్ వేద్ ప్రకాశ్ సింగ్‌పై ఆయన బావమరిది, మామ కాల్పులు జరిపారు. వెన్నెముకలోకి దూసుకెళ్లిన తూటాను తొలగించినప్పటికీ కొన్ని ముక్కలు అందులోనే ఉండిపోయాయి. ప్రస్తుతం కనీసం కూర్చోలేని స్థితిలో ఉన్న ఆయన తన మనుగడ కోసం కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నారని, అటువంటి వ్యక్తి నుంచి భరణం ఎలా ఇప్పించగలమని న్యాయమూర్తి పిటిషనర్‌ను ప్రశ్నించారు. భార్య కుటుంబ సభ్యుల కారణంగానే వేద్ ప్రకాశ్ సింగ్ శారీరకంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని న్యాయమూర్తి చెప్పారు.
భారతీయ సమాజంలో భర్త సంపాదించి కుటుంబాన్ని పోషించడం సర్వసాధారణమని, కాని ఈ కేసు అత్యంత అసాధారణమైందని జస్టిస్ శుక్లా వ్యాఖ్యానించారు. ఈ కేసులో భర్త నుంచి భరణం కోరే హక్కు వేద్ ప్రకాశ్ భార్యకు ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. భార్య చర్యల వల్ల ప్రత్యక్షంగా లేక పరోక్షంగా భర్తకు సంపాదించలేని పరిస్థితి ఏర్పడితే అతని నుంచి భరణాన్ని కోరే హక్కు ఆమెకు ఉండదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. భర్తకు అన్యాయం చేయలేమని, వాస్తవ పరిస్థితులు తమకు కనిపిస్తుంటే న్యాయస్థానం కండ్లకు గంతలు కట్టుకోలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.