ముంబై: తిరుగుబాటు చేసిన శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే, కొందరు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం రాత్రి ఆకస్మాత్తుగా ముంబై నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు విమానంలో వెళ్లారు. అనంతరం అస్సాంలోని గౌహతికి వెళ్లి శివసేనను చీల్చడంతోపాటు మహారాష్ట్రలోని కూటమి ప్రభుత్వం కూల్చేవేతకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బుధవారం ఉదయం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ పార్టీ నేత, రాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్, జయంత్ పాటిల్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. సోమవారం రాత్రి వేళ 22 మంది శివసేన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ప్రత్యేక విమానంలో ముంబైని వీడుతున్న సంగతి ముంబై పోలీసుల దృష్టికి రాలేదా అని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యే భద్రతను చూసే పోలీసులకు గాని, రాష్ట్ర హోంమంత్రికి గాని దీని గురించి తెలియదా? అని నిలదీశారు. ఏక్నాథ్ షిండే శివసేన ఎమ్మెల్యేలతో అర్ధ రాత్రి వేళ విమానంలో సూరత్‌కు వెళ్తున్న విషయంపై నిఘా సమాచారం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా, ఏక్నాథ్ షిండే తిరుగుబాటు శివసేన అంతర్గత వ్యవహారమని శరద్ పవార్ అన్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే దీనిని పరిష్కరించుకుంటారన్న నమ్మకం తనకు ఉందన్నారు. మరోవైపు బుధవారం సాయంత్రం సీఎం ఉద్ధవ్ లైవ్ ప్రసంగం అనంతరం కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే, పార్టీ నేత జితేంద్ర అవద్‌తో కలిసి ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి శరద్ పవార్ వెళ్లారు. సీఎం ఉద్ధవ్‌కు కరోనా నెగిటివ్‌గా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయనతో ప్రత్యేకంగా సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు.