హైదరాబాద్, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ): హెచ్-1బీ వీసా చార్జీలను పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఈ నిర్ణయంతో తెలంగాణ యువతకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా కేంద్రం మౌనం వీడాలని ఒక ప్రకటనలో ఆయన కోరారు.
అమెరికాపై ఒత్తిడి తేవాలని కోరారు. కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దేశానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. మోదీ-ట్రంప్ మధ్య మంచి స్నేహం ఉన్నదని అందరూ చెప్తారని, మరి ఈ నిర్ణయాల సంగతి ఏమిటో కేంద్రమే వెల్లడించాలని సూచించారు. వీసా చార్జీల పెంపు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.