ఛత్తీస్గఢ్, సెప్టెంబర్ 16: బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (ఒకే దేశం.. ఒకే ఎన్నిక)పై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం ఘాటుగా స్పందించారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ఇది ఎంతమాత్రమూ సాధ్యం కాదని, అలా చేయాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్డీయే హయాంలోనే జమిలి అమలుపై చిదంబరం స్పందిస్తూ.. రాజ్యాంగ సవరణలు చేసేందుకు ప్రధాని మోదీకి ఇటు లోక్సభలో కానీ, అటు రాజ్యసభలో కానీ సరిపడా బలం లేదని పేర్కొన్నారు. ఇండియా కూటమి దీనికి వ్యతిరేకమని తేల్చిచెప్పారు.
జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన సమాచారంపై టీఎంసీ, సీపీఐ ఘాటుగా స్పందించాయి. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యతిరేక బీజేపీ చేస్తున్న మరో జిమ్మిక్ ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ అన్నారు. హర్యానా, జమ్ము కశ్మీరు శాసన సభల ఎన్నికలతోపాటు మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలను కూడా ఎందుకు ప్రకటించ లేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో లడకీ బహిన్ పథకాన్ని ప్రకటించిందని, మొదటి విడత సొమ్ము మహిళల బ్యాంకు ఖాతాలకు ఆగస్టులో చేరిందని చెప్పారు. రెండో విడత నిధులు లబ్ధిదారులకు అక్టోబరులో చేరే అవకాశం ఉందన్నారు. అందుకే మహారాష్ట్ర ఎన్నికలను ప్రకటించలేదని చెప్పారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా మాట్లాడుతూ, జమిలి ఎన్నికలను తమ పార్టీ సమర్థించదని చెప్పారు. భారత దేశం వైవిధ్యభరితమైన దేశమని, లోక్సభ, శాసన సభల పదవీ కాలాలు, ఎన్నికైన ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల గురించి రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందన్నారు. ఎన్డీయే ప్రస్తుత పదవీ కాలంలోనే జమిలి ఎన్నికలనుఅమలు చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపిన సంగతి తెలిసిందే.