న్యూఢిల్లీ, మే 11: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకునే బేటీ పడావో.. బేటీ బచావో నినాదం అపహాస్యం పాలవుతున్నది. తెలంగాణకు చెందిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడే స్వయంగా ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోక్సో కేసును ఎదుర్కొంటుండగా బీజేపీ పాలిత బీహార్‌కు చెందిన విద్యాశాఖ మంత్రి బాలికల చదువును చులకన చేస్తూ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. బీహార్‌లో కొత్తగా విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మిథిలేష్ తివారీ బాలికల విద్యపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నాయి.
విలేకరుల సమావేశంలో తివారీ మాట్లాడుతూ అమ్మాయిలకు చదువుకోవలసిన అవసరం ఏముంది, వాళ్లు ఇంట్లోనే ఉండాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదువు అవసరం ఏముంది? మన కుమార్తెలు మన ఇంటి బలం. మన సంపదకు పునాదులు. మహిళల సాధికారత కోసం మోదీ నిలుచుండగా మన కుమార్తెలు వీధుల్లోకి రావలసిన అవసరం ఏముంది? అంటూ తివారీ వ్యాఖ్యానించారు. వెంటనే ఒక విలేకరి జోక్యం చేసుకుని అది వారి(బాలికల) హక్కు అనగా మీ హక్కులు మీకు వాటంతటవే వస్తాయి అంటూ మంత్రి జవాబిచ్చారు.
మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళలు, వారి విద్యపై బీజీపీ మంత్రి వ్యక్తం చేసిన దురహంకార వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. బ్రో మీరు అక్షరాస్యత రేట్లు ఇప్పటికే వెనుకబడి ఉన్న రాష్ర్టానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మరి మీ ప్రధాన ప్రణాళిక సగం జనాభాను తిరిగి వంటగదికే పంపడమా? ఆ తర్వాత ‘చదువుతో బుర్ర పాడవుతుంది’ అని చెప్పి పాఠశాలల్లో కేవలం పెద్దలను ఎలా గౌరవించాలి అని మాత్రమే బోధించాలని, పుస్తకాలను నిషేధించాలని అంటారా? బీహార్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది. పూర్తిగా అంధకారమయంగా ఉజ్వలంగా ఉంది అంటూ ఓ నెటిజన్ విమర్శించాడు. ఆహా ఏం చెప్పారు! బీహార్.. మీరు ఒక విద్యా దిగ్గజాన్ని, నారీ శక్తికరణ్ పార్టీని ఎన్నుకున్నారు అంటూ మరో నెటిజన్ వ్యంగ్యంగా పేర్కొన్నారు.