Women Reservation Bill | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): అవసరమైన మెజారిటీ లేదని తెలిసినప్పటికీ, లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును మోదీ ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టింది? డీలిమిటేషన్‌తో మహిళా బిల్లును లింక్ చేస్తే, విపక్షాలు ఒప్పుకోవని తెలిసినప్పటికీ, ఓటింగ్‌కు ఎందుకు సిద్ధమైంది? మహిళలను అవమానించడానికే కేంద్ర సర్కారు ఇదంతా చేసిందా? సోషల్‌మీడియాలో జరుగుతున్న చర్చ దీనికి బలాన్ని చేకూరుస్తున్నది.
సోషల్‌మీడియాలో నెటిజన్లు చేస్తున్న కామెంట్ల ప్రకారం.. రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ కావాలి. 543 సభ్యులున్న లోక్‌సభలో ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 293 మంది సభ్యుల బలమున్నది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభించాలంటే, కనీస మెజార్టీ 360 కావాలి. ఆ సంఖ్య బీజేపీకి లేదు.
అది పక్కనబెడితే, ఓటింగ్‌కు ముందు కూడా సభలో 528 మంది ఉన్నారు. అప్పుడు మెజారిటీ మార్కు 352కు తగ్గింది. అయినప్పటికీ, ఎన్డీయేకి ఉన్న 293 సభ్యుల బలం.. బిల్లు ఆమోదానికి సరిపోదు. ఇది తెలిసినప్పటికీ, మోదీ ప్రభుత్వం ఓటింగ్‌కు సిద్ధపడింది. అంటే, మహిళా బిల్లు గట్టెక్కదని తెలిసినా బీజేపీ సర్కార్ రాజకీయ క్రీడకు తెరలేపిందని, ఇది ముమ్మాటికీ మహిళలను అవమానించడానికేనని నెటిజన్లు మండిపడుతున్నారు.