Sanjiv Khanna | భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice of India) జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjiv Khanna) నియమితులైన విషయం తెలిసిందే. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం రేపటితో ముగియనుంది. దీంతో తదుపరి సీజేఐగా సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, సీజేఐగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన తన అలవాట్లను మార్చుకున్నారు.
సంజీవ్ ఖన్నాకు రోజూ ఉదయం కొన్ని కిలోమీటర్లు మార్నింగ్ వాక్ (Morning Walk)కు వెళ్లడం అలవాటు. ఢిల్లీలోని లోధి గార్డెన్ ప్రాంతం, తన ఇంటి సమీపంలో ఒంటరిగానే వాకింగ్ చేసేవారు. అయితే, ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికవడంతో ఆయన ఒంటరిగా బయటకు వెళ్లలేని పరిస్థితి. భద్రతా సిబ్బందితో వాకింగ్‌కు వెళ్లడం ఇష్టం లేని ఆయన తన అలవాటును మార్చుకున్నారు. మార్నింగ్ వాక్‌ను పూర్తిగా మానేయాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjiv Khanna) ఆరు నెలలు మాత్రమే ఉంటారు. ఆయన 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు.
పలు కీలక తీర్పుల్లో భాగస్వామి
న్యూఢిల్లీలో 1960, మే 14న జన్మించిన సంజీవ్ ఖన్నా ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ లా సెంటర్లో న్యాయశాస్ర్తాన్ని చదివారు. ఢిల్లీ హైకోర్టులో 2005లో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006లో శాశ్వత జడ్జి అయ్యారు. 2019, జనవరి 18న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పలు ప్రముఖ తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల వినియోగాన్ని ఆయన సమర్థిస్తూ.. అవి పూర్తి భద్రమైనవని, దాని వల్ల బోగస్ ఓట్లు, బూత్‌ల రిగ్గింగ్‌ను అరికట్టవచ్చునని పేర్కొన్నారు. అలాగే ఎలక్టోరల్ బాండ్లపై సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఖన్నా కూడా ఉన్నారు. 370 అధికరణ రద్దును సమర్థిస్తూ తీర్చు ఇచ్చిన ధర్మాసనంలో కూడా ఆయన సభ్యుడే.
Also Read..
Jharkhand | ఎన్నికల వేళ కీలక పరిణామం.. జార్ఖండ్ సీఎం పీఏ ఇంట్లో ఐటీ సోదాలు
Heinrich Klaasen: టీ20 క్రికెట్లో హెన్రిచ్ క్లాసెన్ అరుదైన రికార్డు