Bhagwant Mann : దేశంలో చమురు వాడకాన్ని తగ్గించేందుకు వర్క్ ఫ్రం హోం చేయాలని ఇటీవల ప్రధాని మోదీ ప్రజలకు సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మన్ కూడా ప్రధానిపై ఈ అంశంలో విమర్శలు చేశారు. అందరికీ వర్క్ ఫ్రం హోం చేయాలంటూ సూచించే మోదీ.. ఆయన మాత్రం వర్క్ ఫ్రం హోం ఎందుకు చేయరు అంటూ ప్రశ్నించారు.
శనివారం భగవంత్ మన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ సూచనలిచ్చే తాను మాత్రం ఎందుకు పాటించడం లేదన్నారు. ‘‘అందరికంటే ముందుగా ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు..? నెదర్లాండ్స్ వెళ్లిపోయారు. ఆయన మూడు నాలుగు దేశాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలకు విదేశీ పర్యటనలు తగ్గించుకోమని సలహా ఇస్తారు. కానీ, ఆయన విదేశాలకు వెళ్లిపోతారు. బంగారం కొనొద్దు, విదేశాలకు వెళ్లొద్దు, వర్క్ ఫ్రం హోం చేయాలి అంటారు. మరి ప్రధాని మోదీ వర్క్ ఫ్రం హోం ఎందుకు చేయరు..? యుద్ధం ఎక్కడో జరుగుతుంటే మన దేశంలో ఎందుకు ఆంక్షలు విధిస్తారు..? చాలా దేశాల్లో ఎటువంటి ఆంక్షలు లేవు. నేపాల్, ఇతర దేశాల్లో ఆంక్షలు అమలు చేయడం లేదు.
కానీ, ఇక్కడ మాత్రం ఎందుకు..? ఎన్నికల సమయంలో ఎలాంటి సమస్యా లేదు. కానీ, ఎన్నికలు ముగిసిన తర్వాతే ఇదంతా” అని భగవంత్ మన్ ప్రశ్నించారు. ఇటీవల ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలకు అనేక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్‌ను జాగ్రత్తగా వాడుకోవాలని, ఈవీల వాడకం పెంచాలని, బంగారం కొనొద్దని, విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని, దేశీయంగానే పర్యటించాలని, వీలుంటే ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని సూచించారు. దీనిపై అనేక వర్గాలు, రాజకీయ పక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.