న్యూఢిల్లీ, నవంబర్ 13 : జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు ఒక కిలోమీటరు పరిధిలో గనుల తవ్వకంపై సుప్రీంకోర్టు గురువారం నిషేధించింది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ వన్యప్రాణులకు మైనింగ్ కార్యకలాపాలు హానికరమని స్పష్టం చేసింది. రక్షిత ప్రదేశాలకు ఒక కిలోమీటరు లోపల మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడం వన్యజీవులకు హానిచేస్తాయని న్యాయస్థానం నిశ్చిత అభిప్రాయమని జస్టిస్ కే వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
గోవా ఫౌండేషన్ దాఖలు చేసిన కేసులో గోవాకు సంబంధించి ఈ ఆదేశాలు జారీచేస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఈ ఆదేశాల అవసరం ఉన్నందున వీటిని మొత్తం దేశానికి ఉద్దేశించి జారీ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల సరిహద్దులకు ఒక కిలోమీటరు లోపల ఎటువంటి మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి లేదని సీజేఐ తన తీర్పులో స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా నోటిఫై చేయాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.