బెంగళూరు, సెప్టెంబర్ 6: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటక విలవిల్లాడుతున్నది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరం అల్లాడుతున్నది. బెంగళూరువాసుల రోజూవారీ జీవనం ఆగమాగమైంది. నగరంలోని ప్రధాన రహదారులు నదులను తలపించాయి. నివాసాలు, ఐటీ కార్యాలయాల్లోకి మోకాల్లోతు నీరు చేరింది. మురికి వాడలు పూర్తిగా నీటమునిగాయి. నగరంలోని బడులకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా కంపెనీలు కోరుతున్నాయి. కాగా, బెంగళూరులోని సిద్ధాపుర ప్రాంతంలో విద్యుదాఘాతంతో ఒక మహిళ మృత్యువాతపడింది. బెంగళూరులో వరదలను అరికట్టడంలో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ప్రజలు మండిపడుతున్నారు.
ట్రాక్టర్లపై ఆఫీసులకు ఉద్యోగులు..
రోడ్లన్నీ జలమయం కావడంతో కాలనీల నుంచి కనీసం బయటకు వచ్చే స్థితి కూడా లేదు. చాలామంది ఉద్యోగులు ట్రాక్టర్లు, జేసీబీల సాయంతో ఆఫీసులకు వెళ్లారు. వారు పడుతున్న కష్టాలను పలువురు కంపెనీ సీఈవోలు, ఐటీ ఉద్యోగులు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్నారు. కాగా, బెంగళూరులో ఇంత దారుణమైన వరదలను ఎప్పుడూ చూడలేదని, ఈ వరదలు విధ్వంసం సృష్టించాయని ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. వరదల కారణంగా తాను పడుతున్న కష్టాలను అన్అకాడమీ డైరెక్టర్ గౌరవ్ ముంజల్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తాను నివసిస్తున్న కాలనీ జలదిగ్బంధం అయిందని, తమ కుటుంబం మొత్తం ట్రాక్టర్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లామని, సంబంధిత వీడియో షేర్ చేసుకున్నారు.
మా తప్పేమీ లేదు..
భారీ వర్షాలు, వరదలతో బెంగళూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై రాజకీయాలు చేస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టాల్సింది పోయి తన ఇమేజీ కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నారు. బెంగళూరులో వరదలకు, ప్రస్తుత పరిస్థితులకు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైపల్యం, ప్రణాళిక లేని పరిపాలనే కారణమని విమర్శించారు. బెంగళూరు మొత్తం వరదలు లేవని, చాలా తక్కువ ప్రాంతాల్లోనే ఇలా ఉందని సమస్య తీవ్రతను తగ్గించి చెప్పేందుకు ప్రయత్నించారు. మహాదేవపుర ప్రాంతంలో 69 చెరువులు ఉన్నాయని, అవి ఉప్పొంగడం వల్లే వరదలు సంభవించాయని మరో కారణం చెప్పుకొచ్చారు.
మంత్రి కునుకుపాట్లు..
కర్ణాటకలో భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం బొమ్మై మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన పక్కనే కూర్చున్న రెవెన్యూ మంత్రి ఆర్.అశోక మాత్రం ఇవేమీ పట్టనట్టు ఫుల్లుగా నిద్రపోయారు. ఈ ఫొటోలను ప్రతిపక్ష కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘మునగడాలు రెండు రకాలు ఉంటాయి. ప్రజలు వరదల్లో మునిగిపోతే.. మంత్రి మాత్రం నిద్రలో మునిగిపోయారు’ అంటూ కాంగ్రెస్ వ్యంగ్యాస్ర్తాలు సంధించింది.