న్యూఢిల్లీ, జూలై 11: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియాకు చెందిన డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయిన దుర్ఘటన జరిగి నెలరోజులు అవుతున్న తరుణంలో ప్రమాదంపై దర్యాప్తు చేసిన ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటింగ్ బ్యూరో(ఏఏఐబీ) తన ప్రాథమిక నివేదికను ఒకట్రెండు రోజుల్లో బహిర్గతం చేయనున్నది. ఈ విమాన ప్రమాదానికి ప్రధాన కారణాలు ఈ ప్రాథమిక నివేదిక ద్వారా వెలుగు చూడనున్నాయి. కాగా, ఈ దర్యాప్తునకు సంబంధించి వాల్ స్ట్రీట్ జర్నల్ కీలక విషయాలను బయటపెట్టింది. ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆఫ్ అయ్యాయి.
అయితే ఇవి ఉద్దేశపూర్వకంగా ఆఫ్ అయ్యాయా లేక ప్రమాదవశాత్తు అయ్యాయా అన్న విషయాలు తేలవలసి ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కాక్‌పిట్‌లోని సెంటర్ కన్సోల్‌లో ఉండే ఈ స్విచ్‌లు జీఈ ఏరోస్పేస్ తయారుచేసిన ఇంజిన్లకు ఇంధన సరఫరాను నియంత్రిస్తాయి. స్విచ్‌లను ఆఫ్ పొజిషన్లోకి మార్చడం వల్ల ఇంధన సరఫరా తగ్గిపోయి క్షణాలలోనే ఇంజిన్లు పనిచేయడం నిలిచిపోతుందని నిఫుణులు చెబుతున్నారు. ఆన్‌లో ఉన్న స్విచ్‌లను ఆఫ్‌గా మారిస్తే క్షణాలలోనే ఇంజిన్లు పనిచేయడం ఆగిపోతుందని మాజీ ఎయిర్‌లైన్ పైలట్, ప్రస్తుతం సేఫ్టీ ఆపరేటింగ్ సిస్టమ్స్ సీఈఓ జాన్ కాక్స్ బ్లూమ్‌బర్గ్‌కి తెలిపారు. అనాలోచితంగా స్విచ్ని కదిలించే అవకాశం లేకపోలేదని కూడా ఆయన చెప్పారు. విమానం కూలడంతో 271 మంది మరణించారు.