ఎన్నికలో మొదలైన ఆసక్తికర పోరు
మెజారిటీకి 8,217 ఓట్ల దూరంలో ఎన్డీయే
స్థానిక పార్టీల మద్దతు కోసం కమలం ప్రయత్నాలు
మ్యాజిక్ ఫిగర్ కంటే 8 వేల ఎక్కువ ఓట్లతో విపక్షాలు
ఏకాభిప్రాయంతో కలిసివస్తే ప్రతిపక్షాలదే విజయం!
ఇది గ్రహించే ఏకగ్రీవానికి బీజేపీ రాయబారాలు
రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగింది. దేశ అత్యున్నత పీఠంపై తమ అభ్యర్థిని కూర్చోబెట్టేందుకు అధికార, విపక్షాలు పావులు కదుపుతున్నాయి. దేశంలోని 18 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉన్నప్పటికీ, తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన మెజారిటీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు సొంతంగా లేదు. ఉమ్మడిగా కలిసి వ్యూహాలకు పదును పెడితే విపక్షాలు ఈ పోరులో విజయం సాధించే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని గ్రహించే మిత్రపక్షాలతో పాటు ప్రతిపక్షాలతో భేటీ అయ్యి.. ఏకాభిప్రాయాన్ని సాధించి రాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవం చేసే అంశంపై బీజేపీ అధిష్ఠానం దృష్టిసారిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
రాజ్యసభ ఎన్నికల ప్రభావం అంతంతే!
రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం 4,809 మంది ఓటర్లుగా పాల్గొనబోతున్నారు. 776 మంది ఎంపీల ఓటు విలువ 5,43,200 కాగా.. మొత్తం 4,033 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 5,43,231. వీటి మొత్తం ఓట్ల విలువ 10,86,431. ఇందులో ఎన్డీయేకి 5,35,000 ఓట్లు (49.24 శాతం) ఉన్నాయి. మిగిలిన 5,51,431 ఓట్లు (50.76 శాతం) విపక్షాలవి. నేడు జరుగనున్న రాజ్యసభ ఎన్నికలు ఎలక్టోరల్ కాలేజీలో బలాబలాలపై ప్రభావం చూపినప్పటికీ అది ఎన్డీయేకి లబ్ధి చేకూర్చపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి కారణం ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తమిళనాడు వంటి పెద్ద రాష్ర్టాల్లో ఎన్డీయే అధికారంలో లేకపోవడమే.
కీలకం కానున్న స్థానిక పార్టీలు
రాష్ట్రపతి ఎన్నికలో అభ్యర్థి గెలుపునకు కనీసం 5,43,217 ఓట్లు అవసరం. ఎన్డీయేకి ప్రస్తుతం 5,35,000 ఓట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే ఇంకా 8,217 ఓట్లు అవసరం. ఈ క్రమంలో తటస్థంగా ఉన్న వైసీపీ, బీజేడీలో ఏ ఒక్క పార్టీ మద్దతిచ్చినా.. ఎన్డీయే అభ్యర్థే రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించే అవకాశమున్నది. కాబట్టి వైసీపీ, బీజేడీని మద్దతు కోరే ప్రయత్నాల్లో బీజేపీ ఉన్నది. యూపీయేతో కలిపి మొత్తం విపక్ష పార్టీలకు 5,51,431ఓట్లు ఉన్నాయి. మ్యాజిక్ మార్కు కంటే ఇది 8,214 ఓట్లు ఎక్కువ. అయితే, యూపీయేతో కలిసి విపక్షపార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితేనే వారి విజయం సాధ్యం.
రాష్ట్రపతి ఎన్నికలు-కొన్ని ప్రత్యేకతలు