ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే (Raj Thackeray) గంగా నది పరిశుభ్రత, నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు. కలుషిత గంగా నదిలో ఎవరు స్నానం చేస్తారు? అని ప్రశ్నించారు. తాను మాత్రం ఆ నదిలో పవిత్ర స్నానం చేయబోనని అన్నారు. మూఢనమ్మకాల నుంచి బయటకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మార్చి 8న పార్టీ 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాజ్ ఠాక్రే మాట్లాడారు. పార్టీ నేత బాల నందగావ్కర్ ఇటీవల ప్రయాగ్రాజ్లో ముగిసిన మహా కుంభమేళా నుంచి పవిత్ర గంగా జలాన్ని తెచ్చారని తెలిపారు. అయితే ఆ నీటిని తాగేందుకు తాను నిరాకరించినట్లు చెప్పారు. ‘కరోనా కారణంగా ప్రజలు రెండేళ్ల పాటు మాస్కులు ధరించారు. వారు ఇప్పుడు అక్కడికి వెళ్లి స్నానం చేస్తున్నారు. ఆ గంగలో ఎవరు పవిత్ర స్నానం చేస్తారు?’ అని ప్రశ్నించారు.
కాగా, విశ్వాసానికి కూడా కొంత అర్థం ఉండాలని రాజ్ ఠాక్రే అన్నారు. ‘దేశంలోని ఏ నది కూడా శుభ్రంగా లేదు. అయినా మనం తల్లి అని పిలుస్తాం. విదేశాల్లో నదిని తల్లి అని పిలువరు. కానీ అది పూర్తి శుభ్రంగా ఉంటుంది. మన నదులన్నీ కలుషితమయ్యాయి. ఎవరో ఒకరు అందులో స్నానం చేస్తారు లేదా బట్టలు ఉతుకుతారు’ అని విమర్శించారు.
మరోవైపు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కాలం నుంచి గంగా నదిని శుభ్రపరుస్తామన్న మాటలు తాను వింటున్నానని రాజ్ ఠాక్రే ఎద్దేవా చేశారు. అయితే దురదృష్టవశాత్తు అది జరుగడం లేదని విమర్శించారు. ‘ఈ విశ్వాసం, మూఢనమ్మకాల నుంచి ప్రజలు బయటకు రావాలి. తమ తెలివిని సరిగ్గా ఉపయోగించాలి’ అని అన్నారు.