న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో కమలం పార్టీ నుంచి సీఎం ఎవరు అవుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతున్నది. సీఎం అభ్యర్థిపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకొంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ, సీఎం రేసులో ఉన్న నేతలపై ఇప్పటికే అన్ని పార్టీలు, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
రాష్ర్టానికి కొత్త సీఎంగా గిరిజన వ్యక్తిని చేస్తారా? లేదా ఓబీసీ వర్గం నేతను ఎంపిక చేస్తారా? లేదా బీజేపీ ఇవేమీ కాకుండా మరో విధమైన నిర్ణయం తీసుకొంటుందా? అనే చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేసులో పలువురు సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో మాజీ సీఎం రమణ్‌సింగ్‌తో పాటు గిరిజన కీలక నేత విష్ణుదేవ్ సాయి, ప్రస్తుతం కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్న రేణుకా సింగ్, రాజ్యసభ మాజీ ఎంపీ రామ్విచ్చర్ నేతమ్, ఓబీసీ నేత అరుణ్ సావో ఉన్నారు.
ఎవరి ప్రాముఖ్యత వారిది..
రాష్ట్ర సీఎంగా గిరిజన వర్గానికి చెందిన నేతను బీజేపీ అగ్రనాయకత్వం సీఎం చేయాలనుకొంటే విష్ణు దేవ్ సాయ్ ముందు వరుసలో ఉంటారనే చర్చ ఉన్నది. గతంలో రాష్ర్టానికి సీఎంగా చేసిన రమణ్ సింగ్‌కు మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కనున్నదనేది కొట్టిపారేయలేని అంశం. మరోవైపు మహిళా కోటాలో కేంద్ర మంత్రి రేణుకా సింగ్ కూడా మరో ప్రధాన పోటీదారుగా ఉన్నారు. రామ్విచ్చర్ నేతమ్ గతంలో రమణ్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. కాగా, సీఎం అభ్యర్థిగా ఓబీసీ కోటాలో అరుణ్ సోవో పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. ఆయన బిలాస్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు వరుసగా ఎంపీగా గెలిచారు. అరుణ్ సోవోకు ఓబీసీ కమ్యూనిటీలో గట్టి పట్టు ఉన్నది.