Supreme court | న్యూఢిల్లీ : ఢిల్లీలో పరిపాలనా అధికారం ఎవరిది? అనే కీలక వివాదంపై గురువారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్నది. ఢిల్లీలో సివిల్ సర్వెంట్ల బదిలీలు, నియామకాలకు సంబంధించిన అధికారం ఎవరికి ఉండాలి? అనే అంశంపై గత కొంతకాలంగా కేంద్రానికి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వం మధ్య ఎడతెగని వివాదం నడుస్తున్నది. అంతేకాకుండా కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాలకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అడ్డుపుల్ల వేస్తూ వస్తున్నారు. ఈ వివాదం న్యాయస్థానానికి చేరడంతో ఏప్రిల్ 14, 2019న జస్టిస్‌లు ఏకే సిక్రీ, అశోక్ భూషణ్‌తో కూడిన బెంచ్ తీర్పు చెప్పింది. కేంద్రం విజ్ఞప్తి మేరకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది.
మహారాష్ట్ర వివాదంపైనా తీర్పు
మహారాష్ట్ర ప్రభుత్వంలో గత ఏడాది నెలకొన్న రాజకీయ సంక్షోభంపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు చెప్పనున్నది. శివసేన ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు విడిపోయి ఏక్నాథ్ షిండేతో చేరారు. షిండేయే సీఎం కావడంతో పాటు తమదే అసలైన శివసేన పార్టీ అంటూ ప్రకటించుకున్నారు. దీంతో శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపు, బలపరీక్షలో మెజారిటీని నిరూపించుకోవాలని ఠాక్రేను గవర్నర్ కోరడం, తర్వాత షిండేను సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం తదితర అంశాలను సవాల్ చేస్తూ ఠాక్రే సుప్రీంను ఆశ్రయించారు.