న్యూఢిల్లీ, జూలై 26 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యలపై బీజేపీ సర్కారును వదిలే ప్రసక్తే లేదని లోక్‌సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మణిపూర్ అంశంపై చర్చ జరుపకుండా కేంద్రం పారిపోతున్నదని మండిపడ్డారు. బుధవారం మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మణిపూర్ సంక్షోభంపై ప్రధాని మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, తొమ్మిదేండ్ల పాలనలో దేశాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో సరిహద్దు సమస్యలు, రైతులు, పేదలు, మహిళలు, నిరుద్యోగులు, రైలు ప్రమాదాలు తదితర అంశాలపై మాట్లాడుతామన్నారు. బీజేపీ దేశాన్ని, తెలంగాణను అన్ని విధాలుగా నష్టపరిచిందని దుయ్యబట్టారు. ప్రాజెక్టులకు క్లియరెన్సులు, నిధులు ఇవ్వడం లేదని ఎత్తిచూపారు. తెలంగాణపై అడుగడుగునా వివక్ష చూపిందని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించిందన్నారు. తెలంగాణ అన్నింటిని అధిగమించి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ దేశ ప్రజల కోసం పనిచేస్తుందని నామా స్పష్టం చేశారు.
ఆ రెండు పార్టీలకు సమదూరం
కాంగ్రెస్, బీజేపీలకు బీఆర్ఎస్ సమదూరం పాటిస్తుందని, రెండు పార్టీలు దేశానికి తీరని నష్టం చేశాయని ఎంపీ రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతూ సామాన్య ప్రజలను పట్టించుకోవడం లేదని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ విద్వేషాలను రగిల్చి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నదని ఎంపీ పసునూరి దయాకర్ దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ ఎంపీలకు విప్
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్రం ఏ క్షణంలోనైనా పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ బుధవారం ఎంపీలకు విప్ జారీచేసింది. బిల్లుపై వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సభ్యులందరూ అందుబాటులో ఉండాలని లోక్‌సభలో పార్టీ విప్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్.. రాజ్యసభ విప్ జోగినపల్లి సంతోష్ కుమార్ సభ్యులను కోరారు.