న్యూఢిల్లీ: ప్రజలకు ప్రతి విషయంలోనూ జవాబుదారీగా ఉంటున్నామని ప్రధాని మోదీ ప్రతి చోటా ఉపన్యాసాలు దంచుతుండగా, ఆయన కార్యాలయం మాత్రం ఏ సమాచారం అడిగినా ఇవ్వం అనే సమాధానం ఇస్తున్నది. సమాచారహక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఏ సమాచారం అడిగినా ఏదో ఒక సాకు చెప్పి తిరస్కరిస్తున్నది. పీఎంవో తీరుపై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఎన్నిసార్లు ఆగ్రహం వ్యక్తంచేసినా వైఖరి మార్చుకోవటంలేదు. తాజాగా పీఎంవోపై సీఐసీ అసహనం వ్యక్తంచేసింది.
వివిధ శాఖల్లో జాయింట్ సెక్రటరీ, తత్సమాన హోదా ఉద్యోగులను నియమించేందుకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు ప్రధాని అధికారాలు కల్పిస్తున్నట్టు 2015లో డీవోపీటీకి పీఎంవో డైరెక్టర్ లేఖ రాశారు. ఆ సమాచారం కావాలని పంకజ్ బన్సల్ అనే ఆర్టీఐ కార్యకర్త రెండుసార్లు దరఖాస్తు చేయగా పీఎంవో తిరస్కరించింది. పంకజ్ అడిగిన ప్రశ్నలు ఆర్టీఐ చట్టం సెక్షన్ 24, సెక్షన్ 8(1) (జీ), సెక్షన్ 8 (1) (జే) పరిధిలోకి వస్తాయని, అందువల్ల వాటికి సమాధానం చెప్పలేమని పేర్కొన్నది.
నిజానికి సెక్షన్ 24లో నిఘా, గూఢచారి సంస్థలను చేర్చారు. వాటివద్ద దేశ భద్రతకు సంబంధించిన సమాచారం ఉంటుంది కాబట్టి ఆర్టీఐ పరిధిలోకి రావు. సెక్షన్ (1)(జీ) ప్రకారం.. వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కితే భద్రతకు భంగం ఏర్పడుతుందో వారి వివరాలు వెల్లడించరాదు. సెక్షన్ (1)(జే) ప్రకారం ప్రజా జీవితంతో సంబంధం లేని వ్యక్తుల సమాచారాన్ని బహిర్గతపరచరాదు. అయితే, పంకజ్ అడిగిన ప్రశ్నలు కూడా ఈ సెక్షన్ల పరిధిలోకే వస్తాయని పీఎంవో వాదించటంపై సీఐసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. పంకజ్ కోరిన సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.