న్యూఢిల్లీ: ఓ కేసులో కస్టడీలో ఉన్న నిందితుడు వేరొక కేసులో ముందస్తు బెయిలును కోరవచ్చునని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఆ రెండో కేసులో అరెస్ట్ కానంత వరకు ఆయనకు ఈ హక్కు ఉంటుందని చెప్పింది. ఇటువంటి ముందస్తు బెయిలు దరఖాస్తుపై తీర్పు చెప్పకుండా సెషన్స్ కోర్టు లేదా హైకోర్టులను నిషేధించే ప్రత్యక్ష లేదా పరోక్ష నిబంధన ఏదీ చట్టంలో లేదని వివరించింది. స్వేచ్ఛాయుతమైన, ప్రజాస్వామిక దేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు గల ప్రాధాన్యాన్ని గుర్తించేందుకే సెక్షన్ 438ను సీఆర్పీసీలో చేర్చారని తెలిపింది. తనను అరెస్ట్ చేస్తారేమోనని భావిస్తున్న వ్యక్తికి బెయిలు మంజూరు చేయడానికి ఈ సెక్షన్ దోహదపడుతుందని చెప్పింది.
భారత్కు హిల్సా చేపల ఎగుమతిపై బంగ్లా నిషేధం
కోల్కతా, సెప్టెంబర్ 9: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాకు భారతదేశం ఆశ్రయం ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్న బంగ్లాదేశ్ భారతీయుల ‘జిహ్వ’పై దెబ్బ కొట్టింది. దుర్గాష్ఠమి వేడుకలకు ముందు వారు ఎంతో ప్రీతిగా ఆరగించే రుచికరమైన ‘హిల్సా’ చేపలను వారి నోటికి దూరం చేసింది. సాధారణంగా భారత్లోని చేపల కన్నా రుచికరమైనవిగా పేరొందిన ఈ హిల్సా చేపలు ప్రతి ఏడాది దుర్గాష్ఠమి వేడుకలకు ముందు బంగ్లాదేశ్ నుంచి భారత్కు దిగుమతి అవుతాయి. ఈ పద్మ హిల్సా చేపలు గత ఏడాది బంగ్లా నుంచి 4,000 టన్నులు భారత్కు దిగుమతి అయ్యాయి. అయితే ఈ ఏడాది వాటి ఎగుమతులపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఈ ఏడాది తమ వంట గదుల్లో హిల్సా ఘుమఘుమలు లేకుండానే దుర్గాష్ఠమి వేడుకలు జరుపుకోవాలని, జిహ్వ చాపల్యాన్ని చంపుకోవాల్సిందేనని బెంగాలీలు నిట్టూరుస్తున్నారు.
ఢిల్లీలో బాణసంచాపై నిషేధం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: రాబోయే శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం బాణసంచాపై నిషేధం విధించింది. బాణసంచా తయారీ, అమ్మకం, వినియోగంపై వచ్చే ఏడాది జనవరి 1 వరకు నిషేధం విధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం ఆన్లైన్ అమ్మకాలు, డెలివరీపై కూడా కొనసాగుతుందని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఢిల్లీ పోలీస్, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని, దీని కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని ఆయన చెప్పారు.