monsoon : దేశ రాజధాని డిల్లీ సహా అనేక చోట్ల రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా మంది అప్పుడే దేశంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేశాయా అనుకుంటున్నారు. ఇక వరుసగా వర్షాలు కురుస్తాయా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఈ వర్షాలకు కారణం నైరుతి రుతపవనాలు కాదు. ఎందుకంటే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణంకంటే కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశాలున్నాయని ఐఎండీ అంచనా. నైరుతి రుతుపవనాలు ప్రవేశించేది కేరళ నుంచి. కానీ, ఇంకా అక్కడికి రుతుపవనాలు రాలేదు.
మరి ఇప్పుడు ఎందుకు వర్షాలు పడుతున్నాయి..?
ఈ ఏడాది మేలో దేశమంతా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఎండలు కాశాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో భారీగా నీరు ఇంకిపోయింది. అదంతా తేమగా, తర్వాత మేఘాలుగా మారాయి. భూ వాతవరణంలో ఉన్న ఈ మేఘాలే ఇప్పుడు వానలకు కారణమవుతున్నాయి. ఈ వానల వల్ల ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం లభిస్తోంది. అరేబియా సముద్రం మీదుగా తేమతో కూడిన గాలులు భారత దేశం మీదుగా వీచినప్పుడు నైరుతి రుతుపవనాలు ప్రారంభమవుతాయి. అప్పుడు వీటివల్ల దేశంలో వానలు కురుస్తాయి. ఇవి కేరళ నుంచి మొదలై దేశమంతా వ్యాపిస్తాయి. ఇవి సాధారణంగా నాలుగు నెలలపాటు ఉంటాయి.
రుతుపవనాల ఆరంభం అంటే ఏంటి..
ఇండియన్ మెటిరోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) ప్రకారం వాతావరణ నియమాలను అనుసరించి ఒక కాలాన్ని రుతుపవనాల ఆరంభంగా గుర్తించాలంటూ మూడు ప్రమాణాలను పాటించాలి. అవి.. కేరళలోని నిర్దిష్ణ కేంద్రాల్లో ఈ సీజన్లో వరుసగా 60 శాతం వర్షాలు కురవాలి. అరేబియా సముద్రం నుంచి పశ్చిమ దిశగా వీచే గాలులు నిర్దిష్ట వేగాన్ని అందుకోవాలి. ఈ ప్రాంతమంతా తగినన్ని మేఘాలు విస్తరించి ఉండాలి. ప్రస్తుతం కేరళలోని నిర్దిష్ట ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మేఘాలు కూడా విస్తరించి ఉన్నాయి. కానీ, అరేబియా సముద్రం నుంచి గాలులు వీయడం లేదు. పైన చెప్పిన మూడు ప్రమాణాలు ఒకేసారి ఉంటేనే అది వర్షాకాలం. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైనట్లు.
వరుసగా మారుతున్న అంచనాలు
దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి అనే విషయంలో ఐఎండీ కొన్ని డేట్స్ ప్రకటిస్తుంది. సాధారణంగా అదే సమయంలో దేశంలోకి నైరుతి రుతపవనాలు వీస్తాయి. ఒక వారం కాస్త అటూ ఇటూ అవ్వొచ్చు. కానీ, ఈసారి మాత్రం ఐఎండీ ఈ డేట్లను వరుసగా మారుస్తూ వస్తోంది. ముందుగా మే 26న నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని ప్రకటించింది. ఆ తర్వాత మే 28న, తర్వాత జూన్ 1న, మళ్లీ జూన్ 3న వస్తాయని అని చెప్పింది. చివరగా జూన్ 8న రుతుపవనాలు వస్తాయని చెప్పింది. ఒక్కసారి కేరళను ఈ రుతు పవనాలు తాకితే, మరో రెండు, మూడు వారాల్లోగా దేశమంతా వ్యాపించి వానలు కురుస్తాయి. జూలై ప్రారంభం నాటికి వానలు అంతటా పడొచ్చు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ సైక్లోన్ కారణంగా దేశంలోని తూర్పు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్లలో భారీ గాలులు కూడా వీస్తున్నాయి. క్రమంగా ఇవి బలహీన పడి వానలు తగ్గుతాయి.