జార్ఖండ్ రాష్ట్రం ఝరియా పేరు చెప్పగానే బొగ్గు గనులు గుర్తుకువస్తాయి. బొగ్గు తవ్వకం మూలంగా ఇక్కడ కాలుష్యమూ ఎక్కువే. కోలుకోలేనంతగా ఇక్కడి నేల దెబ్బతిని ఉంటుంది. ఇలాంటి చోట మనోజ్ కుమార్ సింగ్ చెట్లు పెంచుతూ భావితరాలకు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్టు అయిన మనోజ్ పర్యావరణ పరిరక్షకుడు కూడా. అతను 25 ఏండ్లుగా మైనింగ్, పారిశ్రామికీకరణ ఫలితంగా ఝరియా ప్రాంతం కోల్పోయిన పచ్చదనాన్ని తిరిగి ఇస్తున్నాడు. సుమారు 450 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఝరియా గనుల్లో వందేండ్లుగా బొగ్గు తవ్వకం కొనసాగుతున్నది. దీంతో భూగర్భంలో మంటలు రావడం, నేల విధ్వంసానికి గురికావడం కొనసాగుతూ వచ్చింది. పైగా విపరీతమైన గాలి కాలుష్యంతో ఈ ప్రాంతం భారతదేశంలోనే అత్యంత కలుషిత ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మనోజ్ ఓ మంచి అవకాశాన్ని వెతుక్కున్నాడు.
ఒకసారి ఒక మొక్క నాటుతూ పరిసరాల్లో మార్పునకు నాంది పలికాడు. ఇప్పటివరకు తొంభై అయిదు వేలకు పైగా మొక్కలు నాటాడు. అలా ఝరియా బంజర్లను విడిచి వెళ్లిన వసంతాన్ని తిరిగి తెచ్చాడు. మనోజ్ తపన చూసిన స్థానికులు కూడా చెట్లు పెంపకం చేపట్టారు. “1998లో మొక్కలు నాటడం ప్రారంభించాను. ఇప్పటివరకు తొంభై అయిదు వేలకుపైగానే నాటాను. 2005లో గ్రీన్ లైఫ్ అనే సంస్థను ప్రారంభించాను. మా నాన్న ఆయుర్వేద వైద్యుడు. ఆయనకు మొక్కల పెంపకం అంటే ఆసక్తి. అదే నాకు స్ఫూర్తినిచ్చింది.
ఇక నా లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో పుట్టినరోజు, పెండ్లిరోజు మొదలైన సందర్భాల్లో మొక్కలను బహుమతులుగా ఇవ్వాలని అందరికీ చెబుతుంటాను” అని తన లక్ష్యశుద్ధిని చాటుకున్నాడు మనోజ్. అంటే భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి చెట్ల పెంపకాన్ని భావోద్వేగాలతో ముడిపెట్టాడన్నమాట. ఇకపోతే… మనోజ్‌కు తాను చేస్తున్న పనికి ప్రశంసలు, గుర్తింపు అనేది అంత ముఖ్యమైన అంశం కాదు. తన పని సత్ఫలితాలను ఇస్తుండటం అతనికి తృప్తి కలిగిస్తున్నది. భావితరాల ప్రాణవాయువు గురించి ఆలోచించే మనోజ్ పనికి కొలమానాలు ఉండవు. ఈ స్ఫూర్తితో మనమూ ఏడాదికి కనీసం ఒక మొక్కయినా నాటడానికి నడుం బిగించాలి.