న్యూఢిల్లీ: అది డాటా బిల్లు కాదు.. దగా బిల్లు అని విపక్షాలు ముక్తకంఠంతో మండిపడుతున్నాయి. గోప్యత పేరుతో దేశ పౌరుల సమాచారాన్ని అపహరించేందుకు జరిగే కుట్రగా అభివర్ణిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డిజిటల్ వ్యక్తిగత డాటా పరిరక్షణ (డీపీడీపీ) బిల్లు-2022పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. 2019 బిల్లుకు సవరణలు చేసినట్టు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం కొత్త బిల్లులోనూ పాత వివాదాస్పద అంశాలను అలాగే ఉంచిందని విమర్శలు వస్త్తున్నాయి. పౌరుల వ్యక్తిగత వివరాలు సేకరణ విషయంలో చట్ట పరిధి నుంచి ప్రభుత్వాన్ని మినహాయించడాన్ని పలువురు నిలదీస్తున్నారు. ‘న్యాయమైన, సహేతుకమైన’ కారణాల పేరుతో పౌరుల వ్యక్తిగత డిజిటల్ డాటాను వినియోగించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర దర్యాప్తు సంస్థలకు అధికారం అప్పగించడం గోప్యత హక్కు ఉల్లంఘన కాదా? ఇది గోప్యత హక్కు పరిరక్షణపై ప్రభావం చూపదా? అని ప్రశ్నిస్తున్నారు. జేపీసీ సిఫారసులను ప్రతిపాదిత బిల్లు విస్మరించిందని, గత బిల్లు కంటే ప్రస్తుత బిల్లు దారుణంగా ఉన్నదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు.
డాటా బిల్లుపై వస్తున్న ప్రధానమైన అభ్యంతరాల్లో మరొకటి డాటా ప్రొటెక్షన్ బోర్డు (డీపీబీ) ఏర్పాటు అంశం. బోర్డు నియామకాల్లో ప్రభుత్వ ప్రభావం, నియంత్రణ.. డాటా ఉల్లంఘన ఫిర్యాదులను పరిశీలించి, చర్యలు తీసుకొనే విషయంలో బోర్డు స్వతంత్రతను నిర్వీర్యం చేస్తుందనే విమర్శ ఉన్నది. అదేవిధంగా ముసాయిదా డాటా పరిరక్షణ బిల్లు ప్రకారం.. డాటా ప్రొటెక్షన్ బోర్డు, న్యాయస్థానాల్లో చట్టబద్ధతకు నిలబడలేదని న్యాయ నిపుణుడు అర్ఘ్య సేన్‌గుప్తా అభిప్రాయపడ్డారు. డాటా బిల్లును ఆమోదం కోసం పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రయత్నం చేయడం, సాంకేతికంగా ఇది నాలుగోసారి కావడం గమనార్హం.