లక్నో: సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. అయోధ్యలోని రామ మందిరం కోసం ఇచ్చిన విరాళాల్లో కోట్లాది రూపాయలు పక్కదారి పట్టినట్టు వార్తలు వస్తున్నాయని చెప్పారు. దీన్ని కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరిపించాలన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులకు చాలా సున్నితమైనదని.. నిధులు మిస్ అవడం వెనుక కుట్ర ఉందని అఖిలేశ్ ఆరోపించారు.
ఇంత పెద్ద ఆరోపణలపై రామ మందిరం ట్రస్టు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ప్రశ్నించారు. ట్రస్టు నుంచి ఒక్కరు కూడా దీనిపై వివరణ ఇవ్వడానికి ముందుకు రాకపోవడం సిగ్గుచేటు అన్నారు. అధికారిక సమాచారం ప్రకారం రామ మందిరం నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు రూ.3 వేల కోట్ల దాకా విరాళాలు ఇచ్చారు. ప్రస్తుతం రామ మందిరం నుంచి ఏటా వందల కోట్ల ఆదాయం వస్తున్నది. అఖిలేశ్ యాదవ్ ఆరోపణలపై ట్రస్టు సభ్యుడు మహంత్ దినేంద్ర దాస్ స్పందిస్తూ.. అనుమానం ఉంటే విచారణ జరిపించాలని తెలిపారు.