Amit Shah : పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. దేశంలోకి అక్రమ చొరబాటుదారులు, వారి మద్దతుదారులకు బెంగాల్ ప్రజలు గుణపాఠం చెప్పారని అమిత్ షా అన్నారు. బెంగాల్ విజయంపై సోమవారం అమిత్ షా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ః‘‘అక్రమ చొరబాటుదారులు, వారి సానుభూతిపరులకు బెంగాల్ ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇలాంటి అంశాల్లో బుజ్జగింపు రాజకీయం చేస్తున్న వారిని సహించబోమనే స్పష్టమైన సందేశాన్ని ప్రజలు ఇచ్చారు. మోదీ నాయకత్వంపై బెంగాల్ ప్రజలు నమ్మకంతో ఎన్నో ఆశలు, ఆకాంక్షల్ని కలిగి ఉన్నారు. ప్రజల ఆకాంక్షల్ని బీజేపీ నెరవేరుస్తుంది., సోనార్ బంగ్లా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు బీజేపీ రాత్రీ పగలు పని చేస్తుంది. బెంగాల్ వైభవాన్ని తిరిగి తెస్తాం. చైతన్య మహాప్రభు, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి వారి కీర్తిని నిలబెడతాం” అని అమిత్ షా తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
పశ్చిమ బెంగాల్లో అమిత్ షా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎక్కువ రోజులు రాష్ట్రంలోనే ఉండి, అనేక నియోజకవర్గాల్లో పర్యటించారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే ఉంటూ రాజకీయ పరిస్థితుల్ని సమీక్షించారు. బెంగాల్లో బీజేపీ విజయంలో మోదీతో కలిసి కీలక పాత్ర పోషించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.