న్యూఢిల్లీ, నవంబర్ 27: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) కింద 12 రాష్ర్టాల వ్యాప్తంగా 51 కోట్ల మందికి పైగా ఓటర్లను తనిఖీ చేసేందుకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న 5.32 లక్షల మందికిపైగా బూత్ స్థాయి అధికారులు(బీఎల్వో) తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గడచిన 22 రోజుల్లో ఏడు రాష్ర్టాలలో 25 మంది బీఎల్వోలు పని ఒత్తిడిని తట్టుకోలేక మరణించినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో సర్‌పై తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఒక్క పశ్చిమ బెంగాల్లోనే 34 మంది బీఎల్వోలు మరణించినట్లు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపించగా పని ఒత్తిడి కారణంగానే మరణాలు చోటుచేసుకున్నట్లు తమకు అధికారికంగా ధ్రువీకరణ రాలేదని ఎన్నికల కమిషన్(ఈసీ) స్పష్టం చేసింది.
జిల్లా, రాష్ట్ర అధికారుల నుంచి నివేదికలు కోరినట్లు ఈసీ తెలిపింది. సర్ విధుల కారణంగా రాష్ట్రంలో 34 మంది బీఎల్ఓలు మరణించినట్లు పశ్చిమ బెంగాల్ మంత్రి అరూప్ బిశ్వాస్ తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు దొడ్డిదారిలో ఎన్ఆర్సీ(జాతీయ పౌరుల పట్టిక)ని అమలు చేసే లక్ష్యంతో సర్‌ను మోదీ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కాగా, గడచిన 22 రోజుల్లో ఏడు రాష్ర్టాలలో మొత్తం 25 మంది బీఎల్వోలు మరణించినట్లు తెలిసింది. మధ్యప్రదేశ్‌లో 9, ఉత్తరప్రదేశ్‌లో 4, గుజరాత్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, రాజస్థాన్‌లో 3, తమిళనాడులో 4 మరణాలు చోటుచేసుకున్నాయి.
బీఎల్వోలపై సాంకేతిక సమస్యలు, పాలనాపరమైన బాధ్యతలు తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నాయని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఓపీ రావత్ తెలిపారు. బీఎల్వోలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారిలో అత్యధికులు ప్రభుత్వ టీచర్లేనని, వారిపై డిసెంబర్‌లోగా స్కూలు సిలబస్ పూర్తిచేయాల్సిన ఒత్తిడి కూడా ఉంటుందని ఆయన చెప్పారు.
ఓబీసీ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించి జనరల్ క్యాటగిరీ పేర్లను పెంచాలని అధికారులు ఒత్తిడి తెచ్చినట్లు యూపీలోని గోండాలో ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన బీఎల్వో విపిన్ యాదవ్ కుటుంబం ఆరోపించింది. ఆధార్ లేకుండా పేర్లను చేర్చాలని తన భర్తపై అధికారులు ఒత్తిడి తెచ్చినట్లు యాదవ్ భార్య ఆరోపించింది.