కోల్‌కతా, ఆగస్టు 8: బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన వృద్ధాప్య కారణాలతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, లింగమార్పిడి చేసుకున్న కుమార్తె (ప్రస్తుతం కుమారుడు) సుచేతన ఉన్నారు. భట్టాచార్య తన మృతదేహాన్ని వైద్య పరిశోధనలకు దానం చేశారు. దీంతో ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు నివాళి అర్పించిన అనంతరం శుక్రవారం ఆయన పార్ధివ దేహాన్ని దవాఖానకు అప్పగిస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీమ్ తెలిపారు. సుదీర్ఘకాలం బెంగాల్ ముఖ్యమంత్రిగా చేసిన జ్యోతిబసు అనంతరం 2000లో ఆయన నుంచి పార్టీ పగ్గాలు చేపట్టిన బుద్ధదేవ్ పార్టీని ఎన్నికల్లో గెలిపించి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు.
పరిశ్రమల స్థాపనకు వ్యతిరేకి అని పార్టీపై పడిన ముద్రను చెరిపేయడానికి ఆయన అనేక సంస్కరణలు చేపట్టి పారిశ్రామికీకరణను ప్రోత్సహించారు. పదవిలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా ఆయన అత్యంత నిరాడంబర జీవితం గడిపారు. బెంగాల్లో 34 ఏండ్ల వామపక్ష శకం ముగిసి 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ అధికారం చేపట్టిన తర్వాత ఆయన చిన్న అపార్ట్మెంట్కే పరిమితం అయ్యారు. చాలా అరుదుగా ప్రజలకు దర్శనమిచ్చేవారు. కాగా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆయన గృహానికి వెళ్లి మృతదేహానికి నివాళి అర్పించారు. రాజకీయ రంగంలో అవిశ్రాంతంగా పోరాడారని, పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువరానివని అన్నారు. అలాగే భట్టాచార్య మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, బీజేపీ నేత సువేందు అధికారి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల మాజీ మంత్రి టీ హరీశ్ రావు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి, పశ్చిమ బెంగాల్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బెంగాల్ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అంకితభావంతో కృషి చేశారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
బుద్ధదేవ్ భట్టాచార్య(80) మృతి పట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. గురువారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో ఆయన చిత్రపటానికి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. 2000 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా పశ్చిమబెంగాల్‌కు సేవలందించారని వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి, పరిశ్రమలను నెలకొల్పడానికి కృషి చేశారన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు, జాన్‌వెస్లీ, టి సాగర్, పి ప్రభాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు జె బాబురావు, ప్రజాసంఘాల నాయకులు కోట రమేష్, మూడ్ శోభన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.