West Bengal : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం దిశగా దూసుకుపోతోంది. దాదాపు 200 స్థానాల్లో బీజేపీ లీడ్‌లో కొనసాగుతోంది. దీంతో టీఎంసీ ఓటమి ఖాయమైంది. అయితే, పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల సోమవారం హింస చెలరేగుతోంది. వెస్ట్ బర్దబాన్ ప్రాంతం, అసాన్సోల్లోని టీఎంసీ కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు తగులబెట్టారు. పార్టీ ఆఫీసులోని చైర్లు, టేబుళ్లు, సామగ్రిని ధ్వంసం చేశారు.
అలాగే చుట్టుపక్కల వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. కౌంటింగ్ కేంద్రానికి కొద్ది దూరంలోనే ఈ ఘటన జరిగింది. దీంతో ఈ ప్రాంతంలో కేంద్ర భద్రతా బలగాలు మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై అసాన్సోల్ దుర్గాపూర్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ పవన్ కుమార్ స్పందించారు. టీఎంసీ ఆఫీసుపై దాడి జరిగిందని, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మరోవైపు కూచ్ బెహార్‌లోని దిన్హటలో కూడా హింస చెలరేగింది. టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
పరిస్తితి ఆందోళనకరంగా మారడంతో భద్రతా దళాలు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేశాయి. 294 అసెంబ్లీ సీట్లున్న పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టాలటే 148 సీట్లు అవసరం. బీజేపీ మెజారిటీ మార్క్ దాటి లీడింగ్‌లో దూసుకెళ్తోంది. టీఎంసీ మాత్రం 90–100 సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, సాయంత్రానికి ఫలితాలు మారిపోతాయని మమతా బెనర్జీ అన్నారు. తమ టీఎంసీయే అధికారంలోకి వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.