Weather : ఈ ఏడాది ఎల్నినో (El Nino) ప్రభావంతో నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) బలహీనంగా ఉంటాయని, వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Union Govt) అప్రమత్తమైంది. రాబోయే ఖరీఫ్ సీజన్ (Kharif seson) లో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ జారీచేసిన ఆదేశాల ప్రకారం.. ప్రతి జిల్లాలో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళికలు రూపొందించాలి. ముఖ్యంగా తక్కువ నీటితో, తక్కువ కాలంలో దిగుబడినిచ్చే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయల వంటి పంటల సాగును ప్రోత్సహించాలని సూచించింది. ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కరవును తట్టుకునే విత్తన రకాలను అందుబాటులో ఉంచాలని, విత్తన నిల్వలు, నీటి యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టంచేసింది.
ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 92 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని, 35 శాతం వరకు కరవు పరిస్థితులు ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనిపై ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని చెప్పారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.
ప్రస్తుతం దేశంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టాలు సంతృప్తికరంగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశమని చెప్పారు. కాగా రుతుపవనాలపై తుది అంచనాను వాతావరణ శాఖ ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉంది.