న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: భారత్‌లో తయారైన ఆయుధాలు, యుద్ధసామాగ్రిని రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ వినియోగిస్తున్నదని ‘రాయిటర్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇటలీ, చెక్ రిపబ్లిక్ వంటి ఐరోపా దేశాలు భారతీయ తయారీదారుల నుంచి ఆయుధాలు, ఇతర యుద్ధసామాగ్రిని కొనుగోలు చేసి ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్నట్టు ఈ కథనం పేర్కొన్నది.
ఆయుధాల ఎగుమతి అంశాన్ని రష్యా రెండుసార్లు భారత్ ముందు లేవనెత్తిందని, జూలైలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ విషయాన్ని చెప్పారని తెలిపింది. కాగా, ఈ కథనాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ గురువారం తీవ్రంగా ఖండించారు. ఉనికిలో లేని ఉల్లంఘనలకు భారత్ పాల్పడిందని ఈ కథనం పేర్కొన్నదని, ఇది కేవలం ఊహాజనితమైనదని, తప్పుదోవ పట్టించేదని అన్నారు.