ముంబై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు బలమైన ప్రత్యామ్నాయం అవసరమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ముంబైలో ఆయనను కలిశారు. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. నాయకత్వానికి బలమైన ప్రత్యామ్నాయాన్ని అందించాలని చెప్పారు. తమ ఆలోచన ఈ రోజు కోసం కాదని, ఎన్నికల కోసమని అన్నారు. బలమైన ప్రత్యామ్నాయం ఏర్పడాలని, ఆ ఉద్దేశంతోనే మమత తనను కలిసినట్లు తెలిపారు. ఈ అంశంపై తమ మధ్య చాలా సానుకూల చర్చ జరిగిందన్నారు.
అయితే, బలమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ లేదా మరే ఇతర పార్టీనా అన్నది విషయం కాదని శరద్ పవార్ అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారు కలిసి వస్తే వారిని స్వాగతిస్తామని తెలిపారు. విపక్ష పార్టీలతో కూడిన ‘బలమైన ప్రత్యామ్నాయం’ గురించే మమతతో ప్రధానంగా చర్చ జరిగినట్లు వెల్లడించారు.