న్యూఢిల్లీ, మే 18: ప్రస్తుతం మనం ఐదో తరం (5జీ) మొబైల్ కమ్యునికేషన్ సేవల్ని పొందుతున్నాం. అయితే, 5జీ టెక్నాలజీ నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు పక్షులకు హానికరమని, మానవుల మెదళ్లపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని అనుమానాలు ఉండేవి. ఇవన్నీ అపోహలేనని, 5జీ తరంగాలతో మానవులకు ఎలాంటి హానీ లేదని, మానవ ఆరోగ్యంపై ఈ తరంగాల ప్రభావం చూపటం లేదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
జర్మనీకి చెందిన కన్స్ట్రక్టర్ యూనివర్సిటీ సైంటిస్టుల పరిశోధనలో ఈ విషయం రూఢీ అయ్యింది. మానవ చర్మ కణాలను అత్యంత శక్తివంతమైన 5జీ తరంగాల తాకిడికి గురిచేయగా, మానవుల్లో జన్యు వ్యక్తీకరణ, మిథైలేషన్ ప్రొఫైల్లో ఎలాంటి మార్పులు రాలేదని సైంటిస్టులు గుర్తించారు. దీంతో 5జీ టెక్నాలజీతో కలిగే ఆరోగ్య హానిపై జరుగుతున్న చర్చకు ఈ అధ్యయనం ముగింపు పలికినట్టయ్యింది. అధిక తీవ్రత కలిగిన 5జీ సిగ్నల్స్ కూడా మానవ ఆరోగ్యానికి ఎటువంటి హానీ కలిగించవని పరిశోధకులు నిర్ధారించారు.