Rahul Gandhi : దేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైక లోక్‌సభ నియోజకవర్గం వాయనాడ్ అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. వాయనాడ్‌లో ప్రియాంకాగాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం మంగళవారం రాత్రే తన సోదరితోపాటు రాహుల్‌గాంధీ వాయనాడ్‌కు చేరుకున్నారు. ఇవాళ నియోజకవర్గంలోని కల్పెట్టలో ప్రియాంకతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
దేశంలో ఏ లోక్‌సభ స్థానానికైనా ఒకరే ఎంపీ ఉంటారని, కానీ వాయనాడ్‌కు మాత్రం ఇద్దరు ఎంపీలు ఉంటారని రాహుల్‌గాంధీ చెప్పారు. ప్రియాంకాగాంధీ అధికారిక ఎంపీగా ఉంటే, తాను అనధికారిక ఎంపీగా కొనసాగుతానని అన్నారు. ఇద్దరం కలిసి వాయనాడ్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ ర్యాలీలో ప్రియాంకాగాంధీ, రాహుల్‌గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు కూడా పాల్గొన్నారు.
ప్రియాంకాగాంధీ మరికాసేపట్లో వాయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. మల్లికార్జున్ ఖర్గే, సోనియగాంధీ, రాహుల్‌గాంధీ సమక్షంలో ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. కాగా వాయనాడ్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.