(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): పొట్ట కూటి కోసం పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వయనాడ్కు ఏటా వందలాది మంది వలస కూలీలు పనుల కోసం వస్తుంటారు. ఇక్కడి తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పని చేసి.. ఆ వచ్చే కొద్ది డబ్బును సొంత గ్రామాలకు పంపిస్తారు. అలా ఇక్కడి హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్లో పనిచేయడానికి దాదాపు 600 మంది వలస కూలీలు, వారి కుటుంబ సభ్యులు కొన్ని రోజుల క్రితం వచ్చారు. వీరంతా ముండకైలోని నాలుగు వీధుల్లో నివాసం ఏర్పాటు చేసుకొన్నారు. ఇది కొండల మధ్య ఉండే ప్రాంతం. అయితే, మంగళవారం వేకువజామున విరుచుకుపడిన కొండ చరియలతో ఈ 600 మంది కూలీల ఆచూకీ గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. కూలీలు నివాసం ఉంటున్న ఇండ్లన్నీ ధ్వంసమైనట్టు చెబుతున్నారు.
ఘటనపై హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్ కంపెనీ జనరల్ మేనేజర్ బెనిల్ జాన్ స్పందించారు. గల్లంతైన వారిలో కేవలం ఐదుగురి మృతదేహాలను మాత్రమే గుర్తించినట్టు తెలిపారు. స్థానికంగా మొబైల్ ఫోన్ నెట్వర్క్ పనిచేయకపోవడంతో కార్మికులను సంప్రదించే వీలులేకుండా పోయిందని వాపోయారు. ‘మా కార్మికులతో ఇప్పటి వరకు సంప్రదించలేకపోయాం. దీనికి తోడు మొబైల్ ఫోన్ నెట్వర్క్లు కూడా పనిచేయడంలేదు’ అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.