న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, దశాబ్దాలుగా బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో రుజువు చేసే ఘటన ఇది. రూ. 21 కోట్ల ఖర్చుతో నిర్మించిన వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవం జరుపుకోవడానికి ముందే కుప్పకూలిపోయింది. సూరత్ జిల్లాలో 33 గ్రామాలకు రక్షిత తాగు నీరు అందించే లక్ష్యంతో నిర్మించిన వాటర్ ట్యాంకు పాలకుల అవినీతి కారణంగా నేలమట్టమైంది. వాటర్ ట్యాంకు నిర్మాణంలో నాసిరకం సామగ్రి వాడి ఉంటారన్న అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
రాష్ర్టానికి చెందిన గాయ్పగ్లా గ్రూపు వాటర్ సైప్లె స్కీము కింద మాండ్వి తాలూకాలోని తాడ్కేశ్వర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 11 లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యంతో 15 మీటర్ల ఎత్తుతో వాటర్ ట్యాంక్ నిర్మాణమైంది. సోమవారం ట్రయల్ రన్ నిర్వహించగా పెద్దపెట్టున శబ్దంతో వాటర్ ట్యాంక్ కూలిపోగా స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు దాదాపు 9 లక్షల లీటర్ల నీటితో ట్యాంకును నింపినట్లు అధికారులు చెప్పారు. అయితే హఠాత్తుగా మొత్తం కట్టడం పేకమేడలా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. వాటర్ ట్యాంకుకు ప్రారంభోత్సవం కాకపోవడం, నివాస గృహాలకు మంచినీటి సరఫరా కనెక్షన్ ఇవ్వకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.