ఆగ్రా, సెప్టెంబర్ 14: ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన ఆగ్రాలోని తాజ్‌మహల్ ప్రధాన గుమ్మటం వద్ద నీరు లీకవుతున్నది. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ఇది సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వర్షాలకు తాజ్‌మహల్ ప్రాంగణంలోని తోట కూడా నీట మునిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరలైంది.
దీనిపై పురావస్తు శాఖ(ఏఎస్ఐ) సూపరింటెండెంట్ చీఫ్ రాజ్‌కుమార్ పటేల్ మాట్లాడుతూ వర్షాల కారణంగా సీపేజ్ వ్యవస్థలో లోపం ఏర్పడి ప్రధాన డోమ్‌లో లీకేజీ సంభవించిందని చెప్పారు. డ్రోన్ కెమెరాతో ప్రధాన గుమ్మటాన్ని క్షుణ్నంగా పరిశీలించామని, అయితే దానికి ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. సరైన నీటి పారుదల సౌకర్యం లేకే తోట మునిగిందని స్థానికులు తెలిపారు. కాగా, ఎడతెరపి లేని వర్షం కారణంగా ఆగ్రా నగరంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఆగ్రా హైవేపై సైతం వర్షం నీరు పెద్దయెత్తున నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని స్థానికులు తెలిపారు.